ఉపవాస ప్రార్థన పార్ట్ -2 Fasting prayer 2

 





ఉపవాస ప్రార్థన పార్ట్ -2 

ఉపవాస ప్రార్థన గురించి క్లుప్తంగా


part 2


గత భాగంలో 

*ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఏట్టి ఉపవాసము దేవునికి అంగీకారము ? 

*ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము


ఇప్పుడు మరి కొన్ని విషయాలు తెలుసుకొందాము


3) వేటి నిమిత్తం ఉపవాస ప్రార్థన చేయాలి :


చాలా మంది తమ అవసరముల నిమిత్తం అనగా ఉద్యోగం కొరకు, సంతానం కొరకు , స్వస్థత కొరకు , శాంతి సమాధానం కొరకు , మంచి చదవుల కొరకు, వివాహం కొరకు ఇలా రకరకాలుగా వారి అవసరాల నిమిత్తం వారిలో ఉన్న బాధ , వేదనను బట్టి ఉపవాస ప్రార్థన చేస్తుంటారు.

అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు చేసే ప్రార్థన స్వలాభంతో , స్వార్థంతో , దురుద్దేశ్యంతో మరియు దేవుని చిత్తానికి వ్యతిరేఖంగా ఉండకూడదు


*ఉదాహరణకు , మీరు ఒక మంచి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారు.....అయితే ఆ ఉద్యోగం నుంచి వచ్చే సంపాదన ద్వారా నా వంతుగా దేవుని రాజ్యం కట్టబడుటకు ప్రయాసపడతానని , దేవుని సేవకులను ప్రోత్సహిస్తానని భారం నీలో ఉండాలి

* సంతానం కొరకు ప్రార్థిస్తున్నారా? అయితే దేవుడు సంతానం ఇచ్చిన తరువాత ఆ సంతానంను దేవునికి మహిమకరంగా పెంచాలని , దేవుని రాజ్యవ్యాప్తిలో నా సంతానం ఉపయోగపడాలని ఆశ నీలో ఉండాలి

* స్వస్థత కొరకు (మంచి ఆరోగ్యం) ప్రార్థిస్తున్నారా ? అయితే ఆ ఆరోగ్యం ద్వారా దేవుని పరిచర్య చేయాలని , ఆయన సేవలో వాడబడాలని , ఎల్లప్పుడు దేవుని పనులలో ముందుండాలని ఆశ నీలో ఉండాలి


ఈ విధంగా మీరు దేని కొరకు ప్రార్థించినా , దాని వల్ల దేవునికి మహిమ రావాలని , ఆత్మలు రక్షించబడాలని , సువార్తికులను ప్రోత్సహించాలని , దేవుని రాజ్యము కట్టబడాలని ఆశ నీలో ఉండాలి... ఆ ఆశ లేని ఉపవాస ప్రార్థన వ్యర్థము


హన్నాను చూసినట్లయితే తన తీర్మానం చాలా గొప్పది....దేవా నాకు కుమారుడును అనుగ్రహించు ఆ కుమారుడిని నీ సేవకు ప్రతిష్ఠ చేస్తానని తీర్మానం చేసింది

దేవుడు తన మొర విని కుమారుడుని అనుగ్రహించాడు... తను తీర్మానం చేసుకున్న ప్రకారం కుమారుడిని దేవుని సేవకు అప్పచెప్పింది...( 1 సమూయేలు 1 వ అధ్యాయము)

ఇలా దేవుని నుండి పొందుకోవడం మాత్రమే కాదు తిరిగి ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి... ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఇంకా రెట్టింపుగా దీవిస్తాడు...హన్నా కూడా అలానే దీవింపబడింది...తరువాత దేవుడు హన్నా సమర్పించిన కుమారుడుకి బదులుగా ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించాడు...హల్లెలూయా (1 సమూయేలు 2:20,21)


ఇంకా ఉపవాస ప్రార్థనను నీ బలహీనతల నుండి విడుదల కొరకు, పరిశుద్ధ జీవితం కొరకు , పాపాన్ని జయించుట కొరకు , దేవుని కనికరం కొరకు , నూతన మనస్సు కొరకు , ఆత్మల రక్షణ కొరకు , జ్ఞానం కొరకు , దేవుని వాక్యం గ్రహించుట కొరకు , నీ సంఘం కొరకు , సువార్తికుల కొరకు , ఆటంకాల నుండి తప్పింపబడుట కొరకు , దేవుని ప్రణాళిక కొరకు , పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుట కొరకు ఉపవాస ప్రార్థన చేయవచ్చు...


అయితే కొంతమంది దేని కొరకు ఉపవాసము ఉండాలో కూడా తెలియకుండా ఉపవాసము ఉంటుంటారు...దేని కొరకు ఉపవాసము ఉంటున్నారండి అంటే lent days అని కొందరు , దేవుని కోసం అని మరి కొందరు సమాధానం చెప్తుంటారు....దేవుని కోసం ఎందుకు అంటే దానికి యేసయ్య సిలువలో మరణం పొందినందుకు అంటుంటారు... యేసు క్రీస్తు ప్రభువు నా నిమిత్తం ఏడ్వకండి , మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్వుడి అని చెప్తుంటే వీరేమో యేసయ్య కొరకు ఉపవాస ప్రార్థన అంటారు...(లూకా 23:28)

క్రీస్తు సిలువలో మరణించాడు అని ఏడవకండి, అయన అలా ఏడవమని చెప్పలేదు (లూకా 23:31) నువ్వు ఇంకోసారి సిలువ వేయకుండా ఉంటే చాలు అని కోరుకొంటున్నాడు (హెబ్రీ 6:1-6, గలతీ 5:24)

(కొన్ని సార్లు మన పాపస్థితిని బట్టి ఆయన సిలువ త్యాగం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వస్తాయి... అది వేరే విషయం... అంతేకాని ప్రత్యేకంగా యేసయ్య నీవు సిలువలో మరణించావా అని ఉపవాసముండి ఏడవాల్సిన అవసరం లేదు)


నా ప్రియ సహోదరి , సహోదరుడా ఉపవాస ప్రార్థనను ఆచారంగా , గ్రుడ్డిగా చేయకండి, మీరు దేని కొరకు ఉపవాసముండాలో ముందుగానే నిర్ణయించుకొని దాని నిమిత్తం మీ హృదయంను దేవుని సన్నిధిలో కుమ్మరించండి...


4) ఉపవాసము ఎంత కాలము ఉండాలి ? ఎలా చేయాలి ?


ఉపవాసము ఒక్క పూటైనా ఉన్నండి , రెండు రోజులైనా ఉన్నండి , 40 రోజులైనా ఉన్నండి కాని ఆ సమయాన్ని దేవునితో గడపాలని ముందుగానే గత భాగంలో చెప్పడం జరిగింది... ఉపవాసము ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండండి లేదా రాత్రి వరకు ఉండండి లేదా కేవలం రాత్రి మాత్రమే ఉండండి.. మీరు ఒక్క పూట తినడం మానేసి ప్రార్థిస్తే అది ఒక్క పూట ఉపవాస ప్రార్థన , రెండు పూటలు తినడం మానేసి ప్రార్థిస్తే అది రెండు పూటల ఉపవాసము , 24 గంటలు ఉపవాసము ఉంటే అది ఒక దినపు ఉపవాస ప్రార్థన అవుతుంది.... మరియు ఖచ్చితంగా ఉదయం నుండి 3 వరకు మాత్రమే ఉపవాసము ఉండాలని ఆజ్ఞ ఏమి లేదు... రాత్రి కూడా ఉండొచ్చు.... ఇన్ని రోజులు ఖచ్చితంగా చేయాలని కూడా బైబిలు ఏమి చెప్పలేదు... మీలో ఉన్న భారమును బట్టి అవసరతను బట్టి , శక్తిని బట్టి , ఎన్ని రోజులైనా ఉపవాసము ఉండొచ్చు.... బైబిలులో ఆధికంగా 40 రోజులు ఉపవాసమున్నట్లుగా కనబడుతుంది


కొందరు తమ జీవితకాలమంతా ప్రతి వారంలో ఏదో ఒక రోజు ఉపవాసముండాలని నిర్ణయించుకుని కూడా ఉపవాసముంటుంటారు.....కొందరు బుధ , శుక్ర , శని వారం అలా ఉంటుంటారు...


మనమెంతకాలం ఎన్ని సార్లు ఉపవాసము ఉన్నది ముఖ్యము కాదు గాని ఆ ఉపవాస సమయంలో దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థించాము , ఎంతగా వాక్యము చదివాము , ఎంతగా బలపడ్డాము అనేది ముఖ్యము


ఇంకా ఉపవాస సమయంలో కొంతమంది శరీర బలహీనతల వలన లేదా ఆకలిని తట్టుకొనే శక్తి లేకపోవడం వల్ల కొంతమంది ఆహరం మానేసి నీరు త్రాగుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు...ఇంకా ఎక్కువ రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలి అనుకున్నవారు ఆహరం మానేసి నీరు , టీ , నిమ్మరసం లాంటివి కూడా త్రాగుతుంటారు....ఇవి ఏవి ఆకలిని తీర్చవు కాని కొంత ఉపశమనం కొరకు , శక్తి కొరకు తీసుకోవడంలో తప్పేమి లేదు....దేవుడు మన శరీర బలహీనతలను అర్థం చేసుకోగలడు


కనుక మీరు ఉపవాసముండాలి అనుకున్నప్పుడు ఎంత కాలం (ఎన్ని రోజులు లేదా ఎంత సమయం) ఉండాలి , ఏ విధంగా ఉండాలో ముందుగానే నిర్ణయించుకుని ఉపవాస ప్రార్థనలను ప్రారంభించండి


5) ఉపవాస ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుందా ? 


కొన్ని సార్లు పాపం వల్ల అడిగింది పొందుకోలేము...దావీదు మహరాజు తనకు పుట్టిన బిడ్డ కొరకు 7 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేసినా దేవుడు కనికరం చూపించలేదు....(2 సమూయేలు 11, 12 అధ్యాయాలు చదవండి )

కారణం దావీదు తెలిసి తప్పు చేయడం, దేవుని నామము దూషింపబడుటకు అవకాశం యివ్వడం వల్ల దేవుడు తన ప్రార్థనను వినలేదు.... అయితే అత్యంత కృప గల దేవుడు దావీదుకు తన కృప చూపడం మానలేదు.... తను అడిగింది ఇవ్వకపోయినా దేవుడు తనకు మరో బిడ్డను మహ జ్ఞానియైన సొలొమోనును అనుగ్రహించాడు (2 సమూయేలు 12:16-25)


కొన్ని సార్లు మనం తెలిసి తప్పు చేయడం వల్ల కొన్నిటిని కోల్పోతాము....అయినప్పటికీ దేవుడు మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపమును బట్టి , యదార్థతను బట్టి మనకు తన కృప చూపడం మాత్రం మానడు....మనం అడిగింది యివ్వకపోయినా వేరే విధంగానై దేవుడు సహయం చేస్తాడు...

ఇంకొన్ని సార్లు మనం అడుగుతుంది దేవుని చిత్తం కాకపోవచ్చు... కొన్ని సార్లు మనం వాక్యవిరుద్ధంగా ప్రార్థిస్తే కూడా జవాబు రాదు....(ఈ అంశములను గతంలో వివరించడం జరిగింది)



6) ఉపవాస ప్రార్థనను వాయిదాలు వేయవచ్చా ? మధ్యలో విరమించవచ్చా ?


ఫలానా రోజు ఉపవాసముంటాను అని ముందుగానే నిర్ణయించుకున్న తరువాత ఆ రోజు కుదరక ఉపవాసము ఉండకపోవచ్చు... దీని కారణంగా దేవుడు మనల్ని ప్రత్యేకంగా శిక్షిస్తాడా అని కొందరి సందేహం.....దయచేసి గమనించండి.. కొన్ని సార్లు మన వ్యక్తిగత సంబంధిత విషయాల కొరకు ఉపవాసముంటాము....అలా వ్యక్తిగత ఉపవాస ప్రార్థనను వాయిదాలు వేయడం వల్ల నష్టపోయేది మనమే


ఉదాహరణగా పరిశుద్ధత కొరకు మీరు ఉపవాస ప్రార్థన చేయాలి అనుకున్నారు ఒక రోజు... కాని ఆ రోజు ప్రార్థన చేయకుండా వాయిదా వేయడం వల్ల మీరే నష్టపోతారు...ఉపవాస ప్రార్థన చేయకపోతే ఆత్మబలం పొందుకోలేరు...ఆత్మబలం పొందుకోకపోతే శరీరకార్యములను జయించలేరు....శరీరకార్యములను జయించలేదంటే పరిశుద్ధ జీవితం కల్గి ఉండలేరు....పరిశుద్ధ జీవితం 

లేకపోతే దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోలేరు...కనుక ఆశీర్వాదాలను కోల్పోయి నష్టపోయేది మీరే


అయితే కొంతమంది ఆత్మల రక్షణ కోసం, సంఘ పరిచర్య కొరకు, తమ సేవకుల కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు....ఇలాంటివారు ఆత్మల పట్ల భారం కలిగిన విశ్వాసులు...ఇలాంటి వారు ఉపవాస ప్రార్థనను వాయిదాలు వేసిన దానికి మంచి కారణాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను...


నా ప్రియ సహోదరి , సహోదరుడా మీరు ఉపవాస ప్రార్థన చేయాలి అనుకున్న రోజు ఏదో కొన్ని కారణాల వల్ల ఆ రోజు మీరు దేవుని సన్నిధిలో ఆధికంగా గడపలేరని మీకు అనిపిస్తే మరో రోజు మీరు ఉపవాస ప్రార్థనను చేయడం మంచిది.... దేవుని సన్నిధిలో గడపకుండా మీరు ఉపవాసము ఉండడం వల్ల ఏమి ప్రయోజనం ? అనవసరంగా మీ శరీరాన్ని ఆయాసపరచుకోకండి..


బ్రదర్ ఎలాంటి పనుల నిమిత్తం వాయిదా వేయవచ్చు అని అడొగొచ్చు? బైబిలులో మనము 1 కొరింథీ 7:5 వచనంను గమనించినట్లయితే... 


ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. (1 కోరింథీయులకు 7: 5)


ఈ వచనం ప్రకారం భార్యభర్తలు ఇరువరిలో ఎవరైనా ఉపవాస ప్రార్థనలు చేయాలి అనుకున్నప్పుడు ఇద్దరు( భార్యభర్తలు ) మాట్లడుకుని కొన్ని రోజులు దూరంగా ఉండడం (లైంగింకంగా) మంచిది.... ఒకవేళ మనస్సు నిలుపుకోలేకపోతే ప్రార్థనను విరమించి తిరిగి కలుసుకోవడం మంచిది అని పౌలు చెప్తున్నాడు


ఇంకా ఎలాంటి పనుల నిమిత్తం వాయిదాలు వేయవచ్చు అని అడుగుతే దయచేసి గమనించండి... అది మీ పరిస్థితులను బట్టి , మీ అవసరాలను బట్టి ఇలా ఉపవాస ప్రార్థనలు వాయిదా వేయడం వల్ల దేవుడు ఏమి ఆనుకోడులే అనిపిస్తే మీరు వాయిదా వేయడం లేదా విరమించడం చేయవచ్చు.... అంతేకాని ఈ పనుల నిమిత్తమే ప్రత్యేకంగా వాయిదా వేయాలని నేను చెప్పలేను.........జ్ఞానయుక్తంగా నడుచుకోవడం మంచిది


ఉదాహరణగా మీరు ఉపవాసముండాలి అనుకున్న రోజు మీ రక్తసంబంధికి మీతో చాలా ముఖ్యమైన అవసరం పడింది.... మీ సహయం అతనికి కావాలి....అతనికి సహయం చేయడం వల్ల మీరు దేవుని సన్నిధిలో ఉండలేము అనిపిస్తే మీరు ఉపవాస ప్రార్థనను విరమించుకోవడం మంచిది...ఎందుకనగా మీ రక్తసంబంధి ఆపదలో ఉన్నప్పుడు సహయం కోరినప్పుడు మీరు ముఖం చాటివేయడం దేవుని చిత్తం కాదు ..


నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు ""నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు"" దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? (యెషయా 58: 7, 8 )

అలాగే యాకోబు 2:14-26 వచనాలు చదవండి


బ్రదర్ నేను ఉపవాసము 10 రోజులు లేదా 20 ,40 రోజులు ఉండాలి అనుకున్నాను..అప్పుడు ఒకడు మధ్యలో వచ్చి సహయం అడుగుతే ఎలా ? నేను ఇలా మధ్యలో ఉపవాసాన్ని విరమించుకోలేను కదా అనవచ్చు........అలాంటప్పుడు అతనికి మీ పరిస్థితిని వివరించండి... తప్పనిసరి అయితే మీ చేతనైతే మీరు ఉపవాసముంటేనే అతనికి సహయపడండి


ఇంకా మీరు ఉపవాసము ఉండాలి అనుకున్న రోజు లేదా దాని ముందు రోజు మీకు ఆరోగ్యం బాగోలేకపోవచ్చు....జ్వరం వచ్చి వుండొచ్చు. దాని వల్ల మీ శరీరం చాలా బలహీనమవుతుంది...అలాంటి సమయంలో మీరు ఉపవాసాన్ని వాయిదా వేసుకోవడంలో తప్పు లేదు....


దేవుడు మన పరిస్థితులను‌, అ‌‍‌వసరాలను అర్థం చేసుకోగలడు


7) బహిరంగముగా ఉపవాస ప్రార్థనలు ప్రకటించి  చేయకూడదా ?


నేడు పత్రికలలో, t.v లలో అక్కడ అక్కడ వాల్ పోస్టర్స్ లో ఉపవాస ప్రార్థనలు , ఉపవాస పండుగలు ......etc ఇలా కనబడటం మనం చూస్తుంటాము


ఉపవాస ప్రార్థన అంటే రహస్యముగా ఉండాలి , ఇలా బహిరంగముగా ప్రకటించడము తప్పు అంటుంటారు కొందరు.... బైబిలులో బహిరంగముగా కూడా ఉపవాస దినాలను ప్రకటించినట్లుగా ఉంది


అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపు కొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా (2దినవృత్తాంతములు 20: 3)


అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని (ఎజ్రా 8: 21)


నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి (యోనా 3: 5)


పై వచనాల ప్రకారం ఉపవాసదినమును బహిరంగముగా ప్రకటించి మరి చేసారు....కనుక బహిరంగముగా ఉపవాసదినాలను ప్రకటించడంలో తప్పు లేదు... అలా ప్రకటించడం వల్ల కొంతమంది సిద్ధపడి ఉపవాసముండి దేవుని సన్నిధిలో గడుపుతారు.....

మత్తయి సువార్త 6వ అధ్యాయములో కొంతమంది ఉపవాసముంటూ మనుష్యులకు కనబడెవలెనని ముఖములను వికారము చేసుకుని , తాము ఎంతో భక్తుపరులము అన్నట్లుగా మనుష్యులకు తెలియాలని దురుద్దేశ్యంతో ఉపవాసాన్ని పాటిస్తుంటారు...అది తప్పు అని మత్తయి సువార్త 6 వ అధ్యాయంలో చెప్పడం జరిగింది ....అంతేకాని ఒక మంచి ఉద్ధేశ్యంతో అనగా అనేకులు ముందుగానే సిద్ధపడి ఉపవాసముండి దేవుని ఆరాధించాలని , ఆధ్యాత్మికంగా బలపడాలని బహిరంగముగా ప్రకటించడములో ఎలాంటి తప్పు లేదు


ఈ 7 అంశముల ద్వారా మీరు ఉపవాస ప్రార్థన గురించి అనేక విషయాలను తెలుసుకొని ఉంటారని , కొన్ని సందేహాలకు సమాధానం దొరికి ఉంటుందని విశ్వసిస్తున్నాను....దేవుడు ఈ సందేశములను మీ హృదయంలో భద్రపరచును గాక...ఆమెన్


మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి (మత్తయి 26: 41)


యెడతెగక ప్రార్థనచేయుడి (1 థెస్సలొని 5:17)

కాబట్టి మీరంతా ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఎటువంటి ఉపవాసం దేవునికి ఇష్టం అనే విషయాలు మాయి Articles part 1,2 ద్వారా పూర్తిగా తెలుసుకుని వేషదారుల వలె,నామమాత్రపు ఉపవాసం ఉండకుండా.. దేవుని స్తుతిస్తూ,ఆరాధిస్తూ మీ ఆత్మలును ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా బలపరుచుకొండి.