రేపటి నుండి శ్రమల దినాలు.. ఈ దినాలలో చాలామంది ఉపవాసము చేస్తూంట్టారు తమ జీవితాలలో అనేక సమస్యలను జయించడానికి కష్టాలు పోవడానికి శ్రమలను జయించడానికి ఉపవాసం చేస్తూంట్టారు కానీ 3 సంగతులు తెలుసుకోవాలి
1) అసలు ఉపవాసం అంటే ఏమిటి?
2) దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసం ఏమిటి?
3) మనము చేస్తున్న ఉపవాసం ఏమిటి?
4) దీని గురించి తెలుసుకొని మనము ఉపవాసం చేస్తే వాక్యానుసరంగా ఉపవాసం చేస్తే కచ్చితంగా అనేక సమస్యలకు మనకు దేవుడు జవాబు ఇస్తాడు అసలు ఉపవాసము మనము ఎందుకు చేయాలి అంటే?
1) మనము పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసం చేయాలి
2) సాతాను తంత్రములు తెలుసుకుని జయించడానికి ఉపవాసం చేయాలి
3) దేవునికి దగ్గరగా జీవించడానికి ఉపవాసం చేయాలి
ఉపవాసం అంటే అర్ధం
👉ఉపమ్ అంటే దేవునికి దగ్గరగా
👉వాసము అంటే నివసించడం
దేవునికి దగ్గరగా నివసించడము ఉపవాసము అని చెప్పబడినది
అందుకే మనము 40 రోజులు మాత్రమే ఉపవాసం చేసి ఆగిపోకుండా సంవత్సరం అంతటా వారానికి మూడు సార్లు ఉపవాసం చేస్తే ఇంకా దేవునికి దగ్గరగా చేరి శక్తివంతులుగా తయారుచేయబడుతాం
వాక్యం చెప్తుంది సాతాను మన ఆత్మీయ జీవితాలను దోచుకొని నాశనం చేస్తున్నాడు అని
👉 యెషయా 49:24 లో బాలాఢ్యుని చేతిలో కొల్లసొమ్ము ఎవడు దోచుకోగలడు
సాతాను తన్ను తాను బాలాఢ్యునిగా చేసుకొని మన ఆత్మీయ జీవితాలను బందించాడు
👉 ఉపవాస ప్రార్థన అనేది సాతాను దోచుకున్న మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి మనకు ఇస్తుంది 👉 యవేలు 2:12 లో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగిరండి అని దేవుడు పిలుస్తున్నాడు
దేవుడు చెప్పాడు
యవేలు 1:14 లో ఉపవసాదినము ప్రతిష్టించుడి ..
ఉపవాస ప్రార్థన గురించి క్లుప్తంగా
part 1
1) ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి ? ఎట్టి ఉపవాసం దేవునికి అంగీకారము?
సాధారణంగా ఉపవాసము అంటే తినడానికి మంచి ఆహరం ఉండి తినగల్గే శక్తి, ఆరోగ్యము ఉన్న కూడా ఆహరము తీసుకోకపోవడమే ఉపవాసము అని అంటారు.. అయితే దేవుని దృష్టికి మనం చేసే ఉపవాసము అంగీకారం అవాలంటే కేవలం ఆహారం మాని ఉంటే అది అంగీకారం అవదు. మరి ఎట్టి ఉపవాసము దేవునికి అంగీకారం అవుతుందో చూద్దాము
మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయములో చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తు ప్రభువుల వారు ఉపవాసం గురించి మాట్లడుతున్నారు
మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము. (మత్తయి 6:16,17)
ఈ వచనముల ప్రకారం మనం ఉపవాసము ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి కనబడాలని ఆయనకు మనము ప్రార్థించాలని అర్థం అవుతుంది
అయితే కొంతమంది "దేవుని సన్నిధిలో గడపకుండా" బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకొంటూ, తమ ముఖములను వికారం చేసుకొని కృంగిపోయి మనుష్యులకు కనబడవలెనని మేము ఈ రోజు ఉపవాసము ఉన్నాము అని అందరికి చెప్తుంటారు...ఇట్టి ఉపవాసము దేవునికి అంగీకారము అవదు
మరి కొంతమంది ప్రక్కింటివారు లేక ఇంకెవరో 40 రోజులు ఉపవాసము ఉంటున్నారని వీరు కూడా పోటిపడి 40 రోజులు ఉపవాసము ఉంటుంటారు..మీ ఉపవాసము మనుష్యులకు కనబడాలని , గొప్పగా చెప్పుకోవడానికి అని ఉండకూడదు....మీరు హృదయపూర్వకంగా ఉపవాస ప్రార్థన 40 రోజులైనా , ఎన్ని రోజులైనా చేయండి , ఆ ఉపవాస ప్రార్థన వల్ల మీరు ఏమి పొందుకున్నారో అందరికి తెలియచేయండి... అంతేకాని మీ గొప్పతనం చూపించడం కోసం , లేదా ఆచార వ్యవహరంగా ఉపవాసము ఉండకండి..అలా చేయడం వ్యర్థం
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను (మత్తయి 6: 5)
కనుక ఉపవాసము ఉన్నప్పుడు మనుష్యులకు కనబడాలని , గొప్పతనము కోసం చేయకూడదు..హృదయపూర్వకంగా ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస సమయములో దేవుని సన్నిధిలో గడపండి..మనము బైబిలులో గమనించనట్లయితే
* మోషే 40 దినములు ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో గడిపాడు (ద్వితీ 9: 9, 17-19)
* * నెహెమ్యా ఉపవాసముండడం మాత్రమే కాదు కాని ఉపవాసముండి దేవుని యొదట విజ్ఞాపన చేసాడు (నెహెమ్యా 1:4)
* ఎజ్రా కాలములో ఉపవాసదినమును ప్రకటించడం మాత్రమే కాదు కాని వారు ఉపవాసముండి దేవుని వేడుకొన్నారు (ఎజ్రా 8:21-23)
* *అదే విధంగా నెహెమ్యా 9:1-3 వచనాలను గమనించినట్లయితే వారు ఉపవాసము ఉన్నప్పుడు కాసేపు దేవుని వాక్యం చదువుతూ ,కాసేపు ప్రార్థన చేయడం మనం చూడవచ్చు..
కనుక మనం ఉపవాసము ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనను స్తుతిస్తూ , ప్రార్థిస్తూ , వాక్యాన్ని చదువుతూ , ధ్యానిస్తూ, వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ సమయాన్ని గడపాలి...అట్టి ఉపవాసము దేవునికి అంగీకారము
ఇంకా యెషయా 58వ అధ్యాయములో కూడా ఎట్టి ఉపవాసము దేవునికి అనుకూలమో వివరించడం జరిగింది
1)దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు 2)కాడిమాను మోకులు తీయుటయు 3)బాధింపబడినవారిని విడిపించుటయు
4)ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? అని దేవుడు ఉంటుంది.
5)నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు 6)నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు
7)దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
8)వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? (యెషయా 58:6-8) అని ఉంటుంది.
కొంతమంది ఈ యెషయా 58:6-8 వచనాలను ఆధారం చేసుకొని ఉపవాసము అంటే తినకుండా ఉండడము కాదు అని ఇతరులకు సహయపడటమే ఉపవాసము , ఇంకా ప్రత్యేకంగా ఆహరము మాని ప్రార్థించాల్సిన అవసరము లేదనట్లుగా మాట్లడుతున్నారు..ఇది కరెక్ట్ కాదు
యెషయా 58:3-8 వచనాల భావం అది కాదు.వారు ఉపవాసముండి వ్యాపారాలు చేస్తూ , పైగా గొడవలు పడుచూ, వివాదాలు చేస్తూ , అన్యాయం చేస్తూ , ""దేవునికి ప్రార్థించకుండా"" ఇతరులతో సమాధానం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు..కాబట్టి అట్టి ఉపవాసము నాకు అనుకూలము కాదు అని చెప్పాడు దేవుడు...అంతేకాని ఉపవాస ప్రార్థన అవసరం లేదు అని కాదు వాటి భావం...ఒకసారి యెషయా 58:4 వచనం కూడా చూడండి
మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు "మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు"
అట్టి ఉపవాసము నాకనుకూలమా? (యెషయా 58: 4, 5)
ఇతరులకు సహయపడటమే ఉపవాసము అనుకుంటే యేసు క్రీస్తు ప్రభువు, శిష్యులు , పౌలు ఎందుకు ఆహరం మాని ఉపవాస ప్రార్థన చేసారు (మత్తయి 4:2, అపొ.కా 13:2 ; 14:23, 1 కొరింథీ 9:27)
వాక్యమును సమయానుసారంగా సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి
కనుక మనం ఉపవాసము ఉన్నప్పుడు వ్యాపారాలు చేయకుండా ఈ లోకసంబంధమైన విషయాలన్నిటిని మర్చిపోయి హృదయాన్ని శుద్ధి చేసుకొని పైన చెప్పినట్లుగా దేవుని స్తుతిస్తూ , ప్రార్థిస్తూ , వాక్యాన్ని చదువుతూ , ధ్యానిస్తూ, వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ దేవునితో సమయాన్ని గడపాలి...
అంతమాత్రమే కాదు కాని యెషయా 58:6-8 వచనాల ప్రకారం మీ జీవిత ప్రయాణంలో మీ చేతనైనంత మట్టుకు ఇతరులకు మరియు రక్తసంబంధికులకు సహయపడుతూ బీదలను ఆదరిస్తూ ఆకలిగొనినవారికి ఆహరం పెడుతూ , వస్త్రహీనులకు మీ వంతు సహయం చేస్తూ క్రీస్తు ప్రేమను చూపెట్టినప్పుడు మీ ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది... ఇలాంటి జీవితం జీవించకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసిన అది వ్యర్థమే
కొంతమంది తమ ఉద్యోగాలు చేస్తూ ఉపవాసం ఉంటారు..పగలంతా ఏమి తినకుండా ఉద్యోగం చేసి సాయంత్రం లేదా రాత్రి ఇంటికి వచ్చి ఒక పావుగంట లేదా ఆరగంట లేదా గంట ప్రార్థన చేసి ఈ రోజు ఉపవాస ప్రార్థన చేసాము అంటారు..ఈ విధంగా ఉపవాసము ఉండడం వల్ల ఏమి లాభము . క్రైస్తవుడు మాములు రోజుల్లో కూడా (ఉపవాసం లేనప్పుడు) కనీసం ఆరగంట లేదా గంట సేపుయైన దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఇంకా మీరు ఉపవాసము ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపింది ఏమి లేదుగా ? సాధారణ రోజుగానే ఉంది అది కూడా..ఇంకా మీ శరీరమును , ప్రాణమును ఆయాసపరచుకొంటున్నారు
ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఒక్క పూట ఉండాలి అనుకుంటే ఆ ఒక్కపూట దేవుని సన్నిధిలో గడపండి...మీరు ఒక్కరోజు ఉపవాసము ఉండాలి అనుకుంటే ఆ ఒక్క రోజు ప్రార్థిస్తూ ,వాక్యాన్ని చదువుతూ , ధ్యానిస్తూ , వాక్యం వింటూ , దేవుని పనులు చేస్తూ దేవుని మహిమపరచండి..
ఆ... బ్రదర్ ఒక్కపూట ,ఒక్కరోజు లేదా రెండు రోజులు అంటే ఓకే... మరి 40 రోజులు ఆఫీసులో (leave)లీవ్ ఇవ్వరు కదా బ్రదర్ అంటారు... అసలు మిమ్మల్ని 40 రోజులు ఉపవాసముండమని ఎవరు చెప్పారు...అలా ఉండమని బైబిలులో ఎక్కడైనా ఆజ్ఞగా రాయబడిందా ? లేదుగా
మరి యేసు క్రీస్తు 40 రోజులు ఉపవాసము ఉన్నారు కదా బ్రదర్ అనవచ్చు.....ఉన్నారు కాని మనల్ని ఉండమని అయితే ఆజ్ఞ ఇవలేదుగా....? మరి ఆయన 40 రోజులు ఆరణ్యంలో దేవునితో ఏకాంతముగా గడిపాడు.....మరి మీరు ఎందుకు వ్యాపారాలు చేస్తూ ఉపవాసము ఉంటూ (అది కూడా సగము రోజే ఉంటూ) దానికి యేసు క్రీస్తును, మోషేను మాదిరిగా చూపిస్తున్నారు....ఆలోచించండి ఒక్కసారి.
నా ప్రియ సహోదరుడా అనవసరంగా మీ శరీరంను ప్రాణంను ఆయాసపరచుకోవద్దు....ఒక్కపూటయైన, రెండు పూటలైన , మూడు రోజులైన 30,40 రోజులైనా ఉపవాసమున్నండి కాని మీరు దేవుని సన్నిధిలోనే ఆధికంగా గడపండి...అప్పుడు ఆ ఉపవాస ప్రార్థనకు అర్థం ఉంటుంది....... అప్పుడు మీరు ఆత్మబలం పొందుకుంటారు
లేదు బ్రదర్ నేను ఉపవాసముండి ఉదయం ఒక్కసారి ప్రార్థన చేసినా మధ్యలో ఉద్యోగం చేసి లేదా కాలేజీకి వెళ్లి సాయంత్రం లేదా రాత్రి కాసేపు ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటే అది మీ ఇష్టం.... ఈ విధమైన ఉపవాస ప్రార్థన ద్వారా అయితే ఆత్మబలంను పొందుకోలేరు
2)ఉపవాస ప్రార్థన ఎందుకు ?అంత అవసరమా?
మనకు తినడానికి మంచి ఆహారం ఉండి కూడా ఆ ఆహరం తినకుండా శరీరాన్ని నలగొట్టకుంటూ కొన్ని సంగతుల గురించి ప్రార్థిస్తున్నాము అంటే ఆ సంగతుల విషయంలో ఎంత ఆసక్తి , బాధ ,వేదన ఉన్నదో ఈ ఉపవాసము తెలియజేస్తుంది...ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత తెలిసినప్పుడు ఉపవాసము ఎందుకు ఉండాలి , ఎంత అవసరం అనేది అర్థం అవుతుంది
"ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత" :- బైబిలులో కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని శక్తిని , దయను , క్షమాపణను పొందుకున్నట్లుగా వారి అవసరతలు తీర్చుకొన్నట్లుగా మనకు కనబడుతుంది
* నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేసి దేవుని దయను, శక్తిని పొందుకుని యెరూషలేము ప్రాకారము కట్టాడు ( నెహెమ్యా 1:4 ; 6:15)
* ఎజ్రా కాలములో కొంతమంది ఉపవాస ప్రార్థన చేసి దేవుని కాపుదలను పొందుకున్నారు (ఎజ్రా 8:21-23)
* హన్నా ఉపవాస ప్రార్థన చేసి కుమారుడును పొందుకొంది ( 1 సమూ 1:1-20)
* దానియేలు యెరూషలేము పట్టణము నిమిత్తం ప్రార్థన చేయగా " దేవుడు తన దూతను పంపి " మరి యెరూషలేము పట్టణము భవిష్యత్తును తెలియజేసాడు (దానియేలు9 వ అధ్యాయము)
* నీనెవె పట్టణస్థులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని శాపం నుండి తప్పించుకున్నారు (యోనా 3:5-10)
* మోషే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల జనాంగం మీద తన కోపంను త్రిప్పుకున్నాడు (ద్వితీ 9:17-19 ; నిర్గమ 32:10-32)
* సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులు ఉపవాసముండి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారి పాపములను క్షమించి ఫిలిష్తీయుల నుండి వారిని విడిపించాడు ( 1 సమూ 7:3-17)
ఈ విధంగా ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని దయను , శక్తిని , ఆయన ప్రణాళికను , సంతానంను మరియు యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు . కొంతమంది ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని క్షమాపణ పొంది శాపము నుండి కీడు నుండి విడిపింపబడ్డారు....కనుక ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కదలించగలదు...దేవుని కోపాన్ని కూడా త్రిప్పగలదు.....అందుకే వాక్యం సెలవిస్తుంది
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు? (యోవేలు 2:12-14 )
ఇంకా ఉపవాస ప్రార్థన ద్వారా శోధనలను ఎదుర్కొగలము .....
యేసయ్య 40 రోజులు ఉపవాసముండిన తర్వాత సాతాను వచ్చి శోధించినప్పుడు యేసయ్య వాక్యం ద్వారా వాడిని ఎదురించాడు......మనకు వాక్యం తెలిసిన కొన్ని సార్లు సాతానును ఎదురించలేము...కారణం మనలో శక్తి లేకపోవడం, కాని ఉపవాస ప్రార్థన మనకు ఆ శక్తిని అనుగ్రహిస్తుంది
శిష్యులు ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చి ఆ దయ్యమును ఎందుకు వెళ్లగొట్టలేకపోయాము అన్నప్పుడు "అందుకాయన ప్రార్థనవలననే (అనేక ప్రాచీన ప్రతులలో-(వలనను)ఉపవాసము వలననే అని కూర్చబడి యున్నది) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:29)
అవును ఉపవాస ప్రార్థన మనకు సాతానును వాడి దురాత్మలను ఎదుర్కొని శక్తిని ఇస్తుంది
పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందెదరు అని వాక్యం సెలవిస్తుంది (అపొ.కా 1:8)
గనుక మనము ఉపవాస ప్రారనలో పరిశుద్ధాత్ముని కొరకు ప్రార్థించాలి (లూకా 11:13)
పరిశుద్ధాత్మునితో నింపబడాలి, నడిపింపబడాలి అంటే ఉపవాస ప్రార్థన తప్పనిసరిగా అవసరం...ఆత్మపూర్ణులై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది (ఎఫెసీ 5:18)
ఆత్మపూర్ణులుగా ఎప్పుడు ఉండగలము ? శరీరాన్ని గురించి శరీర అవసరాల గురించి ఆలోచించడం మాని ఆత్మీయ ఎదుగుదల కొరకు , అంతరంగ పురుషుని బలం కొరకు ఉపవాసముండి దేవునికి ప్రార్థిస్తూ కొనసాగినప్పుడు ఆత్మపూర్ణులుగా ఉండగలము...అప్పుడే మనలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడగలము
ఆది సంఘం కూడా ఉపవాసముండి ప్రభువును సేవించుచున్నట్లుగా పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడినట్లుగా మనకు కనబడుతుంది
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను (అపో.కార్యములు 13: 2)
ఇంకా ఉపవాస ప్రార్థన శారీర క్రియలను జయింపజేసి పరిశుద్ధ జీవితం జీవించడానికి సహయపడుతుంది...పౌలు భక్తుడు కూడా అంటున్నాడు
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను
(1 కోరింథీ 9: 27)
శరీరాన్ని నలగగొట్టుకోవడం అంటే ఉపవాసము అని అర్థం... శరీరేచ్ఛలను నేరవేర్చకూడదు , శారీరక్రియలకు లోబడకూడదు అనుకుంటే శరీరాన్ని నలగగొట్టుకోవాలి అనగా ఉపవాస ప్రార్థన చేయాలి.. శరీరకార్యములు ఏవో గలతీ 5:16-21 వచనములలో ఉన్నాయి చదవండి
ఆత్మ చేత శారీర క్రియలను చంపుడి అని వాక్యం సెలవిస్తుంది (రోమా 8:13)
ఆత్మ బలం పొందుకున్నప్పుడే శారీరక క్రియలను చంపగలము , ఆ అత్మబలము ఉపవాస ప్రార్థన ద్వారానే పొందుకోగలము
ఇంకా పౌలు భక్తుడు ఆత్మల రక్షణ కొరకు , సంఘముల కొరకు అనేకమార్లు ఉపవాసమున్నట్లుగా , సంఘ కార్యక్రమాలలో కూడా ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనకు బైబిలులో కనబడుతుంది ( 2 కొరింథీ 6:5 ; 11 : 27, 28 ; అపో.కా 14:23)
ఆత్మలను రక్షించుటకు ఉపవాస ప్రార్థన అవసరము....సంఘ కాపరులు తమ సంఘం కొరకు , నూతన ఆత్మల రక్షణ కొరకు , పరిశుద్ధాత్ముని నడిపింపు కొరకు పౌలు వలె ఉపవాస ప్రార్థనలు చేయడం తప్పనిసరిగా అవసరం ...అప్పుడే సంఘం ఉజ్జీవంతో నింపబడుతుంది....ఆ సేవకుడి పరిచర్య ఫలభరితంగా ఉంటుంది
ఈ విధంగా ఉపవాస ప్రార్థన శరీరేచ్ఛలను చంపి పరిశుద్ధ జీవితం జీవించడానికి, ఆత్మబలము పొందుకోవడానికి, దురాత్మ శక్తులను ఎదిరించడానికి , విశ్వాసాభివృద్ధికి , పరిశుద్ధాత్ముని నడిపింపు కొరకు , నీ బలహీనతల నుండి విడుదల కొరకు, ఆత్మల రక్షణ కొరకు , సంఘ ఉజ్జీవం కొరకు, నీ అవసరతల నెరవేర్పు కొరకు ఉపవాస ప్రార్థన తప్పనిసరిగా అవసరం
కనుక ప్రతి ఒక్క విశ్వాసికి ఉపవాస ప్రార్థన జీవితం అవసరం.... అవసరం లేదు అనేంత పరిశుద్ధుడు గొప్పవాడు ఎవరు లేరు
తరువాయి భాగంలో
*వేటి కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి?
**ఉపవాసము ఎంతకాలము ఉండాలి? ఎలా చేయాలి?
* ఉపవాస ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుందా?
* * ఉపవాస ప్రార్థనను వాయిదాలు వేయవచ్చా? మధ్యలో విరమించవచ్చా?
* బహిరంగముగా ఉపవాస ప్రార్థనలు చేయడం లేదా ప్రకటించడం చేయకూడదా?