యేసు క్రీస్తు సిలువలో పలికిన మాటల అర్థం

 యేసు క్రీస్తు సిలువలో 7 మాటలు పలికారు.. ఆ ఏడు మాటలు ద్వారా మనం నేర్చుకోవాలి అనే విషయాలు గురించి తెలుసుకుందాం...





మొదటి మాట

యేసు సిలువలో పలికిన మొదటి మాట..





యేసు తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను (లూకా 23:34)


: ఇది యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట ఈ మాటలో చాలా అర్ధాలు ఉన్నాయి. 

తన తండ్రికి విజ్ఞాపన ప్రార్ధన చేసే మాటగా, క్షమాపణ మనసు కలిగిన మాటగా, ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను వర్ణించవచ్చు. 

 యేసు ఈ మాటలో వీరేమి చేయుచున్నారు అని అంటున్నారు. వీరు అనగా ఎవరు? ప్రజలు సైనికులు పరిశయ్యులు శాస్త్రులు మొదలయినవారు అని మనకి బైబిలు గ్రంధం లో కనబడుతుంది. అయితే వారు ఏం చేశారో బైబిల్లో చూద్దాం. 

వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని (మత్తయి 23:21) కేకలు వేసిరి, ఈ వచనములో యేసుక్రీస్తు ను దోషిగా పిలాతు ముందు నిలువబెట్టారు. 

అప్పుడు ఆయన మీద అనేక మంది నిందలు వేశారు. పిలాతు నేనేమి చేయాలని వారినడుగగా వారందరూ కూడా యేసును సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు. ఎంత అన్యాయపు తీర్పును అక్కడున్న ప్రజలు సూచిస్తున్నారో చూడండి. ఆయనను సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు. ఆయన చేత అనేక అద్భుత కార్యములు పొంది సూచక క్రియలు పొందికూడా  ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుము అని ఎగతాళి చేశారు... కాబట్టి ఈ వచనాలు అన్ని గమనిస్తే... సైనికులు యేసును పెట్టిన హింసలు కనబడుతున్నాయి.

  యేసు ప్రభువు ముఖము మీద ఉమ్ము వేశారు. ఆయనను గుద్దారు.  ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి (మత్తయి 27:29) హింసించారు. ఒక ముల్లు మన కాలికి గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడతాము, అటువంటి ముల్లును కిరీటముగా చేసి ఆయనతలకు గ్రుచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలు, సైనికులు, యూదులందరూ కూడా ఆయనను బాధపెట్టారు. అయినాసరే యేసుప్రభువువారు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని అంటూ ఉన్నారు. వారందరూ నిందలు వేసినా.. అపహాస్యం చేసినా... ఉమ్ము వేసినా. ముళ్ళ కిరీటము పెట్టినా... గుద్దినా... కొట్టినా... పిలువ వేయుమని కేకలు వేసినా వారికేమీ తెలియదని ప్రభువువారు అంటున్నారంటే ఆయనకు వారి మీద ఎంత ప్రేము! అందువలననే వారిని క్షమించుమని తన తండ్రికి విజ్ఞాపన ప్రార్ధన చేసారు


యేసుక్రీస్తు శిలువ మీద శ్రమలు పడుతూ.. తనని శ్రమ పట్టిన వారినింక్షమించమని తండ్రిని ప్రార్థించాడు... దీన్ని బట్టి క్రీస్తు మనల్ని కూడా  హింసించువారిని, మన శత్రువులను

ప్రేమించండి అనే మాటను సిలువలో ఆయన నెరవేర్చినట్లు మనం అర్తంచేస్కోవచ్చు..

ఈ మాటలో ఆయన ప్రేమ ఉంది. ఆయనకు క్షమాపణ మనసు ఉంది. కరుణ ఉంది. తనను హింసించిన వారిని క్షమించమని దేవుడు తన తండ్రికి విజ్ఞాపన చేసాడు. అదేవిధంగా మనము కూడా మన శత్రువులను, మనలను హింసించేవారిని, మన ఇరుగుపొరుగువారిని క్షమించేవిధముగా ఉండాలి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఆ మాట నిజ జీవితంలో మనము కూడా నెరవేర్చి ఆయన ప్రేమను కలిగి ఉండి, నిజమైన క్రైస్తవ జీవితం సాగించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.


2వ మాట





నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను- లూకా 23:43


రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి?

ఇప్పుడు యేసు క్రీస్తు ఈ మాటలు ఎప్పుడు అన్నాడు దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి చూద్దాం..


క్రీస్తు ను ఎన్నో హింసలు పెట్టి కపాలమనబడిన స్థలమునకు తీసుకొని వచ్చారు. అక్కడ ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. ఇద్దరు దొంగలు యేసుప్రభువు వారితో మాట్లాడారు.

వారు ఏ విధంగా మాట్లాడారో చూద్దాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా! నిన్ను నీవు రక్షించుకొనుము. మమ్మును కూడా రక్షించమని చెప్పినట్టు. (లూకా 23:39) లో చూడొచ్చు..

మొదటి దొంగకు వివేచనా శక్తి లేదు. వాడు దొంగ ఇంకొకరిని అనుటకు ఎటువంటి అర్హత లేదు. కానీ వాడు యేసును  దూషిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నాడు. సలహా ఇస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా! నీవు అనేకమైన అద్భుత కార్యములు చేసావు కదా! ఏదైనా ఒక సూచక క్రియ చేసి నిన్ను నీవు రక్షించుకో. ఆ పనిలో భాగముగా మమ్ములను కూడా రక్షించు అని స్వార్ధపూరితమైన ఆలోచనతో క్రీస్తు ను దూషించాడు. అంటే ఇక్కడ మొదటి దొంగ యేసు క్రీస్తు దేవునిగా.. రక్షకుని గా.. నమ్మలేదు..  ఇది మొదటి దొంగ పరిస్థితి.


మరియొక దొంగను గురించి చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవూ అదే శిక్షా విధిలో ఉన్నావు. గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము. గానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసూ నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అని చెప్పినట్లు మనం (లూకా 23:40-42)లో చూడవచ్చు..

రెండవ దొంగ పాపాన్ని ఒప్పుకొనే స్వభావం గలవాడు. అందువల్లనే మొదటి దొంగ యేసు క్రీస్తును హేళనగా మాట్లాడుతుంటే వాడిని గద్దించాడు. అంతే కాదు ఆయన నిజమైన దేవుడు అని సత్యాన్ని గుర్తించాడు. 


మనమూ అనేక దొంగతనాలు చేసే పాపపుబ్రతుకులలో జీవించాము. మనము చేసిన పాపమునకు ఈ శిక్ష వేయుట న్యాయమే. కానీ నీవు శిక్ష అనుభవిస్తూ కూడా ఆ దేవునికి భయపడవా? అని మొదటి దొంగతో హితవు పలుకుతూ హెచ్చరించాడు. 


ఇక్కడొక చిన్న విషయం గమనించాలి. ఇద్దరూ దొంగలే కానీ మొదటివాడు ఆయన దేవుడనే సంగతి గుర్తించలేకపోయాడు. రెండవ వాడు ఆయన నిజమైన దేవుడని గుర్తించి చివరి నిమిషములో ఆ సిలువలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసూ నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అని దీనంగా అడిగాడు. పాపాన్ని క్షమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. గనుకనే వెంటనే పశ్చాత్తాపము పొందిన ఆ రెండవ వానిని క్షమించి నేడు నీవు కూడా పరదైసులో ఉంటావు అని పలికారు.


రెండవ మాట ద్వారా 

దొంగలులో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి 

ఆయన సిలువలో ఒక పాపిని రక్షించాడు. పాపాన్ని క్షమించి పాప క్షమాపణ దయచేసాడు.  


అంటే దీన్ని బట్టి మనము మన జీవితాల్లో ఎన్ని పాప్లు తప్పులు చేస్తూ.. వాటిని ఎరిగి వాటికి పాప క్షమాపణ దేవుని వద్ద మనం అడగాలి.. యేసు క్రీస్తు ను మనం మన రక్షకుని గా స్వీకరించాలి... అప్పుడు ఆయన  మన పాపాల్ని అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనం ఆయన రాజ్యములో ఉండటానికి మనకి ఆహ్వానిస్తాడు...


3వ మాట


యేసు సిలువలో పలికిన 3వ మాట





-యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను 19:26-27


ఇది బాధ్యతతో కూడిన మాట. తల్లి మీద తనకు బాధ్యత ఉంది. గనుక ఆ బాధ్యతను ఇంకొకరికి అప్పగిస్తూ పలికిన మాట. మొదటి రెండు మాటలు పలికిన తరువాత ఆయన తన తల్లియైన మరియను జ్ఞాపకము చేసుకున్నారు.


మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు యేసుక్రీస్తు గనుక తన తల్లి యొక్క సంరక్షణ, మిగతా బాధ్యతలు అన్నీ కూడా తన వెంట వచ్చిన శిష్యునికి అప్పగించారు. తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించారు. తన తల్లిని. ఆ శిష్యుని ఇద్దరిని పిలిచి అమ్మా ... ఇదిగో నీ కుమారుడు ఈ రోజు నుండి నా బాధ్యతంతా ఈ కుమారుడు వహిస్తాడు. అని పలికాడు. ఆ శిష్యునితో  ఇదిగో నీ తల్లి. నేను ఆమెకు చేయవలసిన ప్రతీ ఒక్క పని కూడా ఈ రోజునుండి నీవు చేయాలని ప్రభువు చెప్పారు. నీ తల్లి తండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞను ఆయన సిలువలో నెరవేర్చారు. ఆయన ఎంతో బాదతో ఉన్నా ఆ సిలువలో రక్తము కారిపోతున్నా తాను తల్లి యొక్క బాద్యత మరువకుండా తన శిష్యునికి అప్పగించారు.


ఈ మాటను బట్టి చూస్తే ఆయన మంచి కుమారుడని మనం గ్రహించవచ్చు. ఆయనను పోలి మనము నడుచుకోవాలి. నీ తల్లిని తండ్రిని నీవు గౌరవిస్తున్నావా? గౌరవించకపోతే యేసును చూడు. సిలువలో ఉన్న యేసును చూడు. రక్తము చిందిస్తున్న యేసును చూడు. ఆయన ఆ విధంగా ఉండి కూడా తన తల్లిని మరచిపోలేదు. మనం కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు.


4 వ మాట





ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్ధము- మత్తయి 27:46


ఈ మాటలను బట్టి ఇది ఆవేదన తో మాట్లాడిన మాట గా మనం అర్టంచెస్కోవొచ్చు..


ఆయనను హింసలు పెట్టినప్పుడు కూడా రాని ఆవేదన...

ఈ మాట పలుకుతున్నప్పుడు వచ్చింది. యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. బాప్తీస్మము పొందిన తరువాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. పరిశుద్ధాత్మ చేత అనేక అద్భుత కార్యములు గొప్ప కార్యములు చేసారు. కానీ ఎప్పుడైతే మన పాపం ఆయన మీద వేసుకున్నాడో మన దోషాలను ఆయన భరించాడో ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును విడిచిపెట్టారు. ఎందువలననగా పాపము, పరిశుద్ధాత్మ కలిసి ఉండవు. గనుక లోక పాపమును మోస్తున్న కుమారున్ని ఆ సమయం లో  దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఆ సమయంలో ప్రభువువారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటూ పలికారు. 


ఆయన ఆ సిలులో పడుతున్న ఆవేదన, బాధ నీ చూస్తే..మన పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధాత్మను వదులుకొని పాపిగా మారి శిక్షను అనుభవిస్తున్నాడు.


యేసుప్రభువు వారు మన కొరకు అంత త్యాగము చేసినప్పుడు ఆయనకు మనమేమి చేస్తున్నాము? ఆయనకు మనమేమి ఇవ్వగలుగుతాన్నాము? ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనండి మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి, ఆయన మిమ్మల్ని దీవిస్తాడు.



5వ మాట


యేసు సిలువలో పలికిన 5వ మాట





- నేను దప్పిగొనుచున్నాను - (యోహాను 19:28)


ఇది ఆయనకున్న దాహాన్ని తెలియజేస్తుంది. ఆయన సమరయ స్త్రీ కి జీవ జలపు ఊటలు ఇచ్చి, ఎన్నడూ నీవు దప్పిగొనవు అని వాగ్ధానం చేసాడు. అటువంటి యేసుక్రీస్తు కు ఆ సిలువలో దప్పిక కలుగుతుంది. అయితే అది శారీరక దప్పికా? లేదా ఆత్మీయ దప్పికా? ఆత్మానుసారముగా కలిగిన దప్పిక అనే విషయం గురించి ఇప్పుడు తెలుుకుందాం..


యేసుక్రీస్తు  ఎన్నో బాధలు పొందారు. హింసలను తట్టుకున్నారు. రక్తము కార్చారు. దెబ్బలు తిన్నారు. ఇన్ని తట్టుకున్న ఆయనకు దాహాన్ని తట్టుకోవడం లెక్క కాదు కానీ ఆయన ఆత్మానుసారముగా దప్పిగొంటున్నాడు. అంటే ఈ లోకంలో అనేక ఆత్మలు నశించి- పోతున్నాయి. ఆ ఆత్మలను రక్షించాలనే దప్పిక కలిగి ఉన్నారు ఆయన


పాపము నుండి విడుదల పొందక, పాపములో మ్రగ్గిపోతూ, అపవాది భారిన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు మరణ మార్గములోనికి కాక జీవ మార్గములోనికి వెళ్ళాలనేది ఆయన దాహం. అందువల్లనే నేను దప్పిగొనుచున్నానని ఆయన పలికారు 

మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన దాహం ఈ రోజు వరకు తీరలేదు. ఎందువలననగా ఇప్పటికి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆయన దాహం ఎలా తీరుతుంది.?

కాబట్టి ఆయన దాహాన్ని తీర్చాలని నీకు ఉందా? అయితే నీవు కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉండు. అనేక ఆత్మలను రక్షించాలి. ప్రోత్సహించాలి. బలపరచాలి అనే ఆశను నీవు కలిగి ఉండి, ఆ ప్రకారముగా చేసి ఆయన సిలువలో పడిన దాహాన్ని మనం తీర్చే వారిగా ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.


6వ మాట





సమాప్తమైనది.    యోహాను (19:30)


యేసుప్రభువు వారు పలికిన అన్ని మాటల్లో అతి చిన్నది మరియు అతి అమూల్యమైనది ఈ మాట.  సమాప్తమైనది? 

ఏమి సమాప్తమైనది అని మనము చూసినట్లయితే తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తి చేసి సమాప్తమైనదని పలికినట్లు మనం అర్టంచేస్కోవచ్చు


నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను అని వ్రాయబడినది.

అయితే ఎం నశించింది? 

ఆనాడు ఆదాము హవ్వలు పరిశుద్ధముగా సృష్టించబడ్డారు. కానీ వారు చేసిన పాపం వల్ల పరిశుద్ధత నశించింది.

ఆ నశించిపోయిన పరిశుద్ధతను వెదకి రక్షించి ప్రతీ ఒక్కరినీ పరిశుద్ధులుగా చేయాలి అనేది దేవుని పని.


ఆ పనిని సక్రమముగా యేసు క్రీస్తు పూర్తి చేసారు. యేసు ప్రభువారు అందువలనే తండ్రి నీవు నాకప్పగించిన పని అంతా ముగించెను. సమాప్తమైనది అని  పలికారు.

ఈ పని ముగించడానికి ఆయన ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో శోధనలు అనుభవించారు. వాటన్నిటినీ జయించి సమాప్తము చేశారు. 


కాబట్టి యేసు క్రీస్తు ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క పని చేసారో అదే విధంగా మనము కూడా ఆయన యొక్క పని చేయాలి. ఆయన నామాన్ని ప్రచురము చేయాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. ఈ క్రమములో మనకు ఎన్నో శోధనలు వస్తాయి. ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవన్నీ జయించి దేవుని యొక్క పని చేయవలని దేవుడు కోరుకుంటున్నాడు..


7వ మాట


యేసు సిలువలో పలికిన 7వ మాట





- అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. - లూకా 23:46


ఇది సిలువలో పలికిన చివరి మాట.


ఈ మాట పలికే ముందు ఆయన గొప్ప శబ్దముతో కేక వేసినట్లుగా చూస్తున్నాము. దీనిని తండ్రియైన దేవునితో కుమారుడైన యేసు పలుకుతున్నారు. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అనగా ఆయన ప్రాణమును ఎవరూ తీయలేదు. ఆయనంతట ఆయనే తన ఆత్మను అప్పగిస్తున్నారు 

ఆయన ఎందుకు చనిపోవాలి అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. 

అన్ని పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి. మరణశాసనమెక్కడ వుండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? అని హెబ్రీ 9:16-17లో వ్రాయబడింది. 

యేసుప్రభువు వారు సిలువలో రక్తం చిందించాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణము పెట్టారు. ఆయన చనిపోవడం వలన మన పాపాలు క్షమించబడుతున్నాయి. దోషాలు పరిహరించబడుతున్నాయి.

గనుక ఆయన చనిపోయాడు. అని నీవు బాధపడనవసరంలేదు. ఆయన ఎందుకోసం చనిపోయాడో గుర్తించి మారుమనసు పొందాలి. నేను క్రైస్తవుడను. నేను బాప్తీస్మము తీసుకొని చాలా సంవత్సరాలైంది. నేను మారుమనసు పొందడమేమిటి అని నీవనుకోవద్దు. నిజంగా నీవు మారుమనసు పొందావా? నీ పాత జీవితాన్ని పాత తలంపులను వదిలేసుకున్నావా? ఒక్కసారి ఆలోచించు.


.. ఆయన నీ కోసం నాకోసం మరణాన్ని పొందారు. మనమంతా మారుమనసు పొంది నూతన జీవితాన్ని జీవిస్తే ఆయన చేసిన త్యాగానికి (మరణానికి విలువ ఉంటుంది. ఆ దినమే మనము కూడా చనిపోయి క్రీస్తు నామమంలో మరలా బ్రతు

కుదాం. క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణానికి అర్ధం కల్పిద్దాం.




తండ్రియైన దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.